ఢిల్లీలా మారొద్దు.. నగర వాసులకు బాంబే హైకోర్టు హెచ్చరిక

‘Let’s not become Delhi,’ says Bombay High Court as it cuts time for bursting firecrackers to two hours

ముంబయి: దేశ రాజధాని ఢిల్లీ మాదిరిగానే ముంబయిలో కూడా క్రమంగా వాయు కాలుష్యం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ముంబయి హైకోర్టు నగర వాసులకు కీలక హెచ్చరిక చేసింది. దీపావళికి ఎడాపెడా పటాకులు కాల్చి నగర వాతావరణాన్ని ఢిల్లీలా మార్చవద్దని హెచ్చరించింది. దీపావళి సందర్భంగా పటాకులు కాల్చే సమయ పరిమితిని కూడా కోర్టు మరింత కుదించింది.

ముంబయిలో ఎయిర్‌ పొల్యూషన్‌ పెరుగుతున్న నేపథ్యంలో.. దీపావళి సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు మూడు గంటలు మాత్రమే పటాకులు కాల్చాలని ఈ నెల 6న ముంబయి హైకోర్టు పరిమితులు విధించింది. అయితే కాలుష్య తీవ్రత ఎక్కువ అవుతుండటంతో కోర్టు ఆ కాల పరిమితిని మరింత కుదించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు రెండు గంటలు మాత్రమే పటాకులు కాల్చేందుకు అనుమతించింది.

ముంబయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ, జస్టిస్‌ జీఎస్‌ కుల్కర్ణి నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ ఈ సందర్భంగా ముంబయి వాసులను ఉద్దేశించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “ఢిల్లీలా మారొద్దు. ముంబైకర్‌లుగానే ఉండండి” అని వ్యాఖ్యానించింది. ముంబయిలో వాయు నాణ్యత మరింత క్షీణిస్తున్నదని వ్యాఖ్యానించింది. ముంబయి కూడా ఢిల్లీలా మారకుండా మరిన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది.