ఆదివాసీపై మూత్ర విసర్జన ఘటన.. గిరిజనుడి కాలు కడిగి క్షమాపణలు చెప్పిన సీఎం శివరాజ్

cm-shivraj-washes-feet-of-tribal-man-who-was-urinated-upon-by-bjp-leader-in-mp

భోఫాల్‌ః మధ్యప్రదేశ్‌ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సిద్ధిలో మూత్ర విసర్జన ఘటనలో బాధితుడిని ఈరోజు ఉదయం పరామర్శించారు. శివరాజ్ బాధితుడికి క్షమాపణ చెప్పడమే కాదు ఆయన కాళ్లు కడిగి తన బాధను వ్యక్తం చేశారు. ఇటీవల సిద్ధి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు చెందిన వీడియో వైరల్ అయ్యింది. అందులో ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి గిరిజన కూలీ దాస్మేష్ రావత్‌ పై మూత్ర విసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బాధితుడు గిరిజన కూలీ దాస్మేష్ రావత్‌ ను తన నివాసానికి పిలిచి.. బాధితుడి కాళ్లను కడిగి క్షమాపణలు చెప్పాడు. దాస్మేష్‌కు తన నివాసంలో ముఖ్యమంత్రి కాళ్లు కడిగారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం శివరాజ్‌ మాట్లాడుతూ.. ఈ విషయం చూసి తన మనసు ఎంతో చలించిందని చెప్పారు. ఆపై జరిగిన ఘటనకు క్షమాపణలు తెలిపారు. సీఎం బాధితుడి కుటుంబం గురించి సమాచారం తీసుకున్నారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ .. దాస్మేష్ ను ‘సుదామా’ అంటూ పిలిచి తన స్నేహితుడిని చేసుకున్నారు.

నేరస్థుడికి మతం, పార్టీ, కులం లేవని సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. ఈ కారణంగానే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకున్నామని, ఎవరి పట్ల వివక్ష చూపవద్దని అందరికి విజ్ఞప్తి చేశారు. ప్రవేశ్ శుక్లాను కూడా మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ఇప్పటికే నిందితుడిపై సెక్షన్ 294, 594 కింద కేసులతో పాటు.. ఎస్సీ-ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. అంతే కాదు నిందితులపై ఎన్‌ఎస్‌ఏ విధించాలని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. ఈ ఘటనలో నిందితుడు ప్రవేశ్ శుక్లాపై ఎంపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ప్రవేశ్ శుక్లా ఇంటిపై ఉన్న ఆక్రమణను కూడా కూల్చివేశారు.