లోయలో పడిన బస్సు..27 మంది మృతి

మెక్సికో సిటీ నుంచి శాంటియాగో వెళుతుండగా ప్రమాదం

27-killed-and-17-injured-in-passenger-bus-accident-in-mexico

మెక్సి : మెక్సికోలో (ఈరోజు) బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికుల బస్సు ఒకటి అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులలో 27 మంది అక్కడికక్కడే చనిపోగా.. తీవ్ర గాయాలతో మరో 17 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మంగళవారం రాత్రి (మెక్సికో కాలమానం ప్రకారం) మెక్సికో సిటీ నుంచి శాంటియాగో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

కొండ ప్రాంతంలో బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కనే లోయలో పడిపోయిందని చెప్పారు. సుమారు 25 మీటర్ల ఎత్తు నుంచి కింద పడడంతో బస్సు నుజ్జునుజ్జయిందని అధికారులు తెలిపారు. ప్రమాద విషయం తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించాయన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిలో ఆరుగురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.