83 ఏళ్ల శరద్ పవార్ తప్పుకోవాలన్న అజిత్ పవార్..తన తండ్రిని ఏమైనా అంటే సహించేది లేదుః సుప్రియా సూలే

వయసు పెరిగినంత మాత్రాన పని చేయడం ఎందుకు ఆపాలన్న సుప్రియా సూలే

supriya-sule-fires-on-ajit-pawar

ముంబయిః మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన పార్టీగానే కాకుండా, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పార్టీగా పేరుగాంచిన ఎన్సీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పై తిరుగుబాటు చేసి, పార్టీని అజిత్ పవార్ నిట్టనిలువునా చీల్చారు. తన వర్గంతో కలిసి షిండే ప్రభుత్వంలో చేరి, మరోసారి డిప్యూటీ సీఎం బాధ్యతలను స్వీకరించారు.

తాజాగా శరద్ పవార్ ను ఉద్దేశిస్తూ అజిత్ పవార్ మాట్లాడుతూ… శరద్ పవార్ కు వయసు పైబడిందని, ఆయన తప్పుకుని కొత్తవారికి దారి ఇవ్వాలని అన్నారు. ఇతర పార్టీల్లో నేతలు వయసు దాటిన తర్వాత రిటైర్ అవుతారని… బీజేపీ నేతలు 75 ఏళ్లకు తప్పుకుంటారని… మీ వయసు 83 ఏళ్లు కదా.. మీరు తప్పుకోండని చెప్పారు.

ఈ నేపథ్యంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే మాట్లాడుతూ… వయసు పెరిగినంత మాత్రాన పని చేయడం ఎందుకు ఆపాలని ప్రశ్నించారు. రతన్ టాటా వయసు 86 ఏళ్లు అని, సైరస్ పూనావాలా వయసు 84 అని, అమితాబ్ వయసు 82 అని చెప్పారు. వారెన్ బఫెట్, ఫరూక్ అబ్దుల్లా పేర్లను కూడా ఆమె ప్రస్తావించారు. వారు వయసు మీదపడ్డా యాక్టివ్ గా పని చేస్తున్నారని చెప్పారు. తమను ఏమన్నా సహిస్తామని… తన తండ్రిని ఏమైనా అంటే సహించే ప్రసక్తే లేదని మండిపడ్డారు.