నేటి నుండి రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ..సీఎం రేవంత్ ఆదేశాలు

రైతుల ఖాతాల్లో నేటి నుండి రైతు బంధు డబ్బులు జమ కాబోతున్నాయి. పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుందా అని ఎదురుచూసిన రైతులకు.. రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్‌బాబు ఉన్నతాధికారులతో చర్చల అనంతరం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ విషయంలో కార్యారచణ ప్రారంభించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

తెలంగాణలో ఎన్నికల కారణంగా అన్నదాతలకు పెట్టుబడి సాయం ఆలస్యమైంది. ఎలక్షన్‌ కోడ్‌ అమలు ఉండటంతో నిలిపివేసిన ఈసీ.. ఆ తర్వాత నిధులు విడుదలకు ఆమోదం తెలిపింది. అయితే.. ఇందుకు సంబంధించి రూల్స్‌ని బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు బ్రేక్‌ చేశారన్న కారణంతో తిరిగి నిధుల విడుదలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటి వరకు రైతులు పంట సాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కాంగ్రెస్‌ తాము ప్రకటించిన మాదిరి రైతు భరోసాను ఇవ్వాలనుకుంది. అయితే.. ఎన్నికల హామీ ఇచ్చినప్పటికీ.. రైతు భరోసా పథకానికి విధి విధానాలు ఖరారు కాకపోవడంతో ప్రస్తుతానికి పాత పద్దతిలోనే నిధులు ఇవ్వాలని ఆదేశించారు.