జగన్‌‌ను సొంత తల్లి, చెల్లెళ్లు కూడా నమ్మడం లేదుః సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy Comments On AP CM YS Jagan

హైదరాబాద్‌ః చంద్రబాబును గెలిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, చంద్రబాబు శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ఏపీ సీఎం జగన్ శుక్రవారం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు సీఎం, టీపీసీసీ రేవంత్ రెడ్డి కౌంటర్లు ఇచ్చారు.

తన మీద ఏపీ సీఎం జగన్‌ చేసిన ఆరోపణలకు విలువ లేదని రేవంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబుతో తనకు రాజకీయ సంబంధాలు లేవని, ఏపీలో షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి తనవంతు సహకారం ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. ఏపీలో షర్మిల పెద్ద నాయకురాలని, ఆమెను గెలిపించడానికి రాహుల్‌గాంధీ ఏపీ పర్యటనకు వెళ్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక సొంత చెల్లెళ్లు, కన్నతల్లి కూడా జగన్‌ను నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. సొంత చిన్నాన్న హత్య గురించి తల్లి, చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వాలని సూచిస్తున్నానని అన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఉన్న తనకు స్వరాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ‘మీట్‌ ద ప్రెస్‌’లో రేవంత్ రెడ్డి ఈ మేరకు మాట్లాడారు.

కాగా చంద్రబాబును గెలిపించేందుకే ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసిందని శుక్రవారం కడపలో వైఎస్ జగన్ అన్నారు. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. చంద్రబాబు పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్‌తో కాపురం చేస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్‌ పార్టీ, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై కూడా పరోక్షంగా విమర్శలు గుప్పించారు.