అమరావతి పిటిషన్లను మరో ధర్మాసనానికి బదిలీ చేయండిః రిజిస్ట్రీకి సీజేఐ ఆదేశం

ఈ పిటిషన్లను విచారించేందుకు సీజేఐ జస్టిస్ యు.యు. లలిత్ విముఖత

'Supreme' notices to CSs of AP and Bihar states
supreme-court

న్యూఢిల్లీః ఏపీ రాజధాని విషయంలో దాఖలైన పిటిషన్ల విచారణ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్ మంగళవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్, రాజధాని ప్రాంత రైతుల పిటిషన్లపై విచారణకు ఆయన విముఖత చూపారు. ఈ పిటిషన్లను తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి పంపాలని సుప్రీం రిజిస్ట్రీని ప్రధాన నాయమూర్తి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుమారు 2వేల పేజీలతో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన ఏపీ సర్కారు రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని సుప్రీంకోర్టును కోరింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడం అవుతుందని ప్రభుత్వం ఆ పిటిషన్ ప్రస్తావించింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. అదే సమయంలో అమరావతి రైతులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రధాన అంశాలపై స్పష్టత లేదని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముంగిటకు రావడంతో అమరావతి విషయంలో కీలక తీర్పు వస్తుందని, ప్రభుత్వం, ప్రతిపక్షాలు, రైతులు ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ, సీజేఐ ‘నాట్ బిఫోర్ మీ’ అనే నిబంధనను ఉపయోగించి కేసు విచారణ నుంచి వైదొలిగారు. దాంతో, కేసు విచారణకు కొత్త బెంచ్ ను ఏర్పాటు కానుంది. కాగా, చీఫ్ జస్టిస్ లలిత్ గతంలో న్యాయవాదిగా జగన్ కేసులను వాదించారు. అందుకే రాజధాని పిటిషన్ల విచారణ నుంచి ఆయన తప్పుకున్నట్టు తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/