షోలాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి

నిత్యం రోడ్డు ప్రమాదాలతో రోడ్లు రక్తసిక్తం అవుతున్నాయి. ఇంట్లో నుండి బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి వచ్చే వరకు టెన్షనే. మనం జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నప్పటికీ ఎదుట వారి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి రోజు రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరుగగా..ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

వివరాల్లోకి వెళ్తే.. 32 మంది భక్తుల బృందం కార్తీక ఏకాదశి సందర్భంగా జాతర్‌వాడి నుంచి పంధర్‌పూర్‌కు వెళ్తున్న సమయంలో వేగంగా వచ్చిన ఎస్‌యూవీ భక్తులను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారును 75 సంవత్సరాల వ్యక్తి నడుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.