ఒకే వేదికను పంచుకున్న మోడీ, గెహ్లాట్

ప్రపంచంలో మోడీ ఎంతో గౌరవం పొందుతున్నారని వ్యాఖ్య

pm-modi-ashok-gehlot-share-stage-in-rajasthan

న్యూఢిల్లీః బిజెపిని తీవ్రంగా విమర్శించే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ప్రధాని మోడీ ఒకే వేదికను పంచుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా గెహ్లాట్ మాట్లాడుతూ.. ప్రధాని విదేశాలకు వెళ్లినప్పుడు గొప్ప గౌరవం లభిస్తోందంటూ.. ఇది గాంధీ దేశానికి మోడీ ప్రధాని కావడం వల్లేననీ, అది మన ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో చెబుతోందని అన్నారు. రాజస్థాన్ లోని బన్స్ వారా జిల్లా మన్ గఢ్ ధామ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వీరు హాజరయ్యారు. 1913లో బ్రిటిషర్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన భిల్ ఆదీవాసీ వర్గం ప్రజలను సన్మానించేందుకు ఈ కార్యక్రమం జరిగింది.

‘‘మన దేశంలో ప్రజాస్వామ్యం బలంగా వేళ్లూనుకుని ఉంది. ప్రపంచం దీన్ని గుర్తించింది. అందుకే ఈ దేశ ప్రధాని వస్తున్నందుకు వారు గర్వపడుతున్నారు’’ అని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. అంతకుముందు ఇదే కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ నాడు బ్రిటిషర్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన 1,500 మందికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు. ఇక్కడి నుంచి ప్రధాని మోడీ గుజరాత్ లో తీగల వంతెన కుప్పకూలిన మోర్బీ ప్రాంతానికి వెళతారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/