రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందిః చంద్రబాబు

చీఫ్ సెక్రెటరీకి నారా చంద్రబాబు నాయుడు లేఖ

Chandrababu Tour Program in Kuppam
tdp-chief-chandrababu

అమరావతిః మాండాస్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతన్నలకు కన్నీరు మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం, కడప, అన్నమయ్య, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. అనంతపురం జిల్లాలో వరి పంట, అపరాలు, కడప, అన్నమయ్య జిల్లాలలో అరటి, బొప్పాయి, అపరాలు, నెల్లూరులో వరి నార్లు, ప్రకాశంలో పొగాకు, పప్పు శనగ, మిరప, ధాన్యం, ప్రత్తి, మినుము, గుంటూరులో వరి, మిరప, కృష్ణాలో వరి, అపరాల పంటలకు తీవ్ర నష్టం జరిగిందని తెలపారు. పత్తి, మిరప, సెనగ, పొగాకు, మినుముతో పాటు ఉద్యాన పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు.

వేసిన విత్తనాలు కుళ్లిపోవడం, మొలకెత్తినచోట మొక్కలు కొట్టుకుపోవడం, దెబ్బతినడం జరిగిందని… కోతకొచ్చిన వరి పంట నీటమునగడంతో పాటు ఆరబెట్టిన ధాన్యం తడిసిందని చెప్పారు. ఈ తుఫానుతో రైతులకు వేల కోట్ల నష్టం జరిగిందని… అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని విమర్శించారు. రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.

తరుగు లేకుండా ధాన్యం కొనుగోళ్లను తక్షణమే అన్ని జిల్లాల్లో ప్రారంభించాలని లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు. వరి, అపరాలకు ఎకరానికి రూ. 20 వేలు, వాణిజ్య, ఉద్యానవన పంటలకు ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని అన్నారు. నిబంధనలు, ఆంక్షలు లేకుండా బీమా పరిహారాన్ని త్వరగా అందించాలని సూచించారు. కౌలు రైతులకు నేరుగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యంలో తేమ శాతంతో సంబంధం లేకుండా మొత్తం పంటను కొనుగోలు చేయాలని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/