జూన్ 30 న తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల

ఈరోజు మంగళవారం ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన తెలంగాణ సర్కార్ ..జూన్ 30న ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేర‌కు పదోతరగతి బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. రాష్ట్రంలో మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరిగాయి.

దాదాపు 5లక్షలకుపైగా విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్స్ రాశారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరోనా వల్ల విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభంకావడంతో సిలబస్ ను 70శాతానికి కుదించి క్వశ్చన్ పేపర్ తయారు చేశారు. పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు తగ్గించారు. క‌రోనా వల్ల రెండేళ్లుగా ప‌రీక్ష‌లు లేకుండానే విద్యార్థుల‌ను పాస్ కాగా.. రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లకు హాజ‌రైన విద్యార్థులు ఏ మేర ఉత్తీర్ణ‌త సాధిస్తార‌నే అంశంపై ఉత్కంఠ నెల‌కొంది. అయితే ఈ సారి కూడా పదో తరగతి ఫలితాల్లో గ్రేడింగ్‌ విధానాన్నే అమలు చేయ‌నున్నట్లు తెలుస్తోంది. 2011 నుంచి రాష్ట్రంలో గ్రేడింగ్‌ విధానాన్నే కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందు కు ఈ గ్రేడింగ్‌ విధానాన్ని అప్పట్లో ప్రవేశపెట్టారు. అయితే ఏపీలో గ్రేడింగ్‌ విధానాన్ని తీసేసి మార్కుల ద్వారా ఫలితాలను ప్రకటిస్తుండటంతో తెలంగాణలో ఈసారి ఫలితాలు ఎలా ప్రకటిస్తారనే దానిపై చర్చ జరుగుతుంది.