వివేకానందరెడ్డి హత్యకేసు : ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ

వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు నేడు వైస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ని విచారించారు. దాదాపు నాల్గు గంటలపాటు విచారించి పలు కీలక విషయాలను అడిగి తెలుసుకున్నారు. వివేకా హత్య కేసులో దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించడం జరిగింది.

హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డిని ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలోని సీబీఐ బృందం 4 గంటల పాటు ప్రశ్నించింది. విచారణ ముగిసిన అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనకు తెలిసిన అన్ని విషయాలను సీబీఐ అధికారులకు చెప్పినట్లు తెలిపారు. విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరానని, కానీ రికార్డింగ్ కు సీబీఐ అధికారులు అంగీకరించలేదని తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేస్తానని తెలిపినట్లు అవినాష్ మీడియా కు తెలిపారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని సీబీఐ అధికారులు చెప్పారని వెల్లడించారు. విచారణ పారదర్శకంగా జరగాలని సీబీఐ అధికారులను కోరినట్లు చెప్పారు. ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన విషయాలు బహిర్గతం చేయలేనని అన్నారు.