నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

Parliament

న్యూఢిల్లీ: ఈరోజు పార్లమెంట్‌లో మోడీ సర్కార్‌ చివరి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. కాగా సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తిచేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

లోక్‌సభ ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం మరోసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపడుతుంది. ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకే కొనసాగనున్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన మంగళవారం పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ముకశ్మీర్‌ బడ్జెట్‌ను కూడా సీతారామన్‌ పార్లమెంట్‌ ప్రవేశపెడుతారని చెప్పారు. ఈ సమావేశాల ఎజెండాలో రాష్ట్రపతి ప్రసంగం, తాత్కాలిక బడ్జెట్‌ ప్రతిపాదన, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, చర్చకు ప్రధాని మోడీ సమాధానం ఉంటాయని వివరించారు.

ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు పలు అంశాలను లేవనెత్తారు. నిరుద్యోగం, అధిక ద్రవ్యోల్బణం, వ్యవసాయరంగ సంక్షోభం, మణిపూర్‌లో హింస అంశాలను సభలో లేవనెత్తుతామని చెప్పారు. ప్రార్థనా స్థలాల చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ నేత ఎస్‌టీ హసన్‌ డిమాండ్‌ చేశారు.

ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం 1947, ఆగస్టు 15 నాటికి ఆయా మతాల వారి స్వాధీనంలో ఉన్న ప్రార్థనా స్థలాలను యథాతథంగా కొనసాగించాలని, వారణాసిలోని జ్ఞానవాపి మసీదును హిందువులకు అప్పగించాలన్న వాదన ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో హసన్‌ ఈ డిమాండ్‌ చేశారు. వీటిపై ప్రహ్లాద్‌ జోషీ స్పందిస్తూ.. అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు.