సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అస్వస్థత

సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆయన్ను హైదరాబాద్ లోని కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేసారు. ప్రస్తుతం డాక్టర్స్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ వార్త తెలిసి సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కృష్ణ ఆరోగ్యం ఫై ఆరా తీస్తున్నారు. మరోవైపు అభిమానులు సైతం హాస్పటల్ కు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. వయసు రీత్యా ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ మధ్యనే ఆయన భార్య , మహేష్ తల్లి ఇందిరా దేవి కన్నుమూయడం జరిగింది. ఆమె మరణం తరువాత కృష్ణ మరింత కుంగిపోయారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షిణించినట్లు తెలుస్తోంది.

1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు, మూడవ సినిమా గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఉపకరించాయి. ఆపైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించాడు. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తీశాడు. 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో నెలకొల్పాడు. దర్శకుడిగానూ 16 సినిమాలు తీశాడు.

కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు, జాన్రాలు పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే. వీటితో పాటుగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ప్రధానంగా 1976-1985 మధ్యకాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత దశకు అందుకుంది. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తిచేశాడు. ఇందుకోసం మూడు షిఫ్టులు చొప్పున వేగంగా సినిమాలు పూర్తిచేసేవాడు.

కృష్ణ కు ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం (1997), ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2003), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (2008), పద్మభూషణ్ పురస్కారం (2009) లభించాయి.