పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన.. ఉభయ సభలు సోమవారానికి వాయిదా

lok-sabha-adjourned-till-monday

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపుర్‌ అంశం కుదిపేస్తుంది. రెండో రోజు కూడా ప్రతిపక్షాలు మణిపూర్ అంశం పై నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. మణిపూర్ లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనతోపాటు.. ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబడటంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది.

ఉదయం 11 గంటలు లోక్ సభ ప్రారంభం కాగానే.. మణిపూర్ అంశంపై చర్చించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. వెల్ లోకి దూసుకెళ్లి నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేస్తారని స్పీకర్ ఓం బిర్లా ఎంత చెప్పినా విపక్షాలు వినిపించుకోలేదు. ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటించారు. తిరిగి లోక్ సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్ష సభ్యులు శాంతిచకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తూ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.