రెండు రష్యన్ పెట్రోలింగ్ బోట్లు ధ్వంసం : ఉక్రెయిన్‌

కీవ్: ఈరోజు ఉద‌యం న‌ల్ల‌స‌ముద్రంలోని స్నేక్ ఐలాండ్ వ‌ద్ద పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్న రెండు రష్యా బోట్ల‌ను ధ్వంసం చేసిన‌ట్లు ఉక్రెయిన్ ర‌క్ష‌ణ శాఖ తెలిపింది. బోట్ల పేల్చివేత‌కు సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫూటేజ్‌ను రిలీజ్ చేశారు. మిలిట‌రీ బోటులో భారీగా పేలుడు సంభ‌వించిన దృశ్యాలు దాంట్లో ఉన్నాయి. ట‌ర్కీకి చెందిన బైర‌క్తార్ డ్రోన్ల‌తో ఆ దాడి జ‌రిగింద‌ని, ఆ డ్రోన్లు ప‌నిచేస్తున్న‌ట్లు ఉక్రెయిన్ సైనిక ద‌ళాల క‌మాండ‌ర్ ఇన్ చీఫ్ వ‌లేరి జ‌లుజిని తెలిపారు. ర‌ప్తార్ పెట్రోలింగ్ బోట్ల‌లో ముగ్గురు సిబ్బంది ఉంటారు.

మ‌రో 20 మందిని అవి తీసుకువెళ్ల‌గ‌ల‌వు. వాటిల్లో సాధార‌ణంగా మెషిన్ గ‌న్స్ ఉంటాయి. ల్యాండింగ్ ఆప‌రేష‌న్స్ కోసం వీటిని ఎక్కువ‌గా వాడుతుంటారు. స్నేక్ ఐలాండ్ వ‌ద్ద ఉక్రెయిన్ ద‌ళాలు ర‌ష్యాను తీవ్రంగా ప్ర‌తిఘ‌టించాయి. ఇటీవ‌ల అక్క‌డ కొంద‌రు ఉక్రెయిన్ సైనికులు స‌రెండ‌ర్ అయ్యేందుకు నిరాక‌రించారు. ఈ మ‌ధ్య‌నే న‌ల్ల‌స‌ముద్రంలో పార్కింగ్ చేసిన మాస్క్‌వా యుద్ధ నౌక‌ను కూడా పేల్చిన‌ట్లు ఉక్రెయిన్ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/