బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ తీసేస్తాం – జెపి నడ్డా

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆదివారం నాగర్ కర్నూలులో జరిగిన బీజేపీ నవ సంకల్ప బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ…ఎందరో ఆత్మబలిదానాల ఫలితంగా ఏర్పాటైన రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని మండిపడ్డారు.

తెలంగాణకు ప్రధాని మోడీ భారీగా నిధులు ఇచ్చారన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మోడీ పాలనలో దేశం పురోగమిస్తోందన్నారు. బీజేపీతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని జేపీ నడ్డా అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద రూ.4 కోట్ల మందికి ఇళ్లు నిర్మించామని, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా రైతులకు ఏటా రూ.6 వేలు ఇస్తున్నామని వెల్లడించారు. ప్రధాని మోడీ 9 ఏళ్ల పాలనతో అన్ని వర్గాలకు న్యాయం చేశామని, దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని తెలిపారు.

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన ఈ పార్టీ అసలు పేరు ‘భ్రష్టాచార్ రాక్షసుల సమితి’ అని నడ్డా ఆక్షేపించారు. రైతులను పీడించి తమ జేబులను నింపుకోవడానికే ధరణి పోర్టల్ ఉందని అన్నారు. ధరణితో భారీ అవినీతికి పాల్పడుతున్నారని.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ధరణి రద్దు చేస్తామని నడ్డా సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ పార్టీ పోర్టల్ కూడా బంద్ అవుతుందని వ్యాఖ్యనించారు. ధరణి పోర్టల్‌పై తాజాగా జేపీ నడ్డా చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్‌లో కాక రేపుతున్నాయి.