దళితబంధు డబ్బులు తిన్న ఎమ్మెల్యేలను కేసీఆర్ వెంటనే బర్తరఫ్ చేయాలంటూ బిజెపి నేతల డిమాండ్

దళితబంధు డబ్బులు తిన్న ఎమ్మెల్యేలను కేసీఆర్ వెంటనే బర్తరఫ్ చేయాలంటూ బిజెపి నేతల డిమాండ్ చేస్తున్నారు. గురువారం బీఆర్ఎస్ ప్లీనరీలో దళితబంధుపై సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను హెచ్చరించిన సంగతి తెలిసిందే. కొందరు ఎమ్మెల్యేలు దళితబంధు పేరుతో రూ.2 నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేశారని, ఆ చిట్టా మొత్తం తన వద్ద ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇదే రిపీట్ అయితే పార్టీ టిక్కెట్ కాదు, పార్టీ నుంచి వెళ్లిపోవడమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. అనుచరులు తీసుకున్నా ఆ బాధ్యత ఎమ్మెల్యేలదేనని కేసీఆర్ చెప్పారు. ఎమ్మెల్యేలందరికీ ఇదే తన చివరి వార్నింగ్ అంటూ సీఎం సంచలన కామెంట్స్ చేశారు.

ఈ వ్యాఖ్యలపై బిజెపి నేతలు స్పందిస్తున్నారు. బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హుజరాబాద్ పర్యటనలో భాగంగా మాట్లాడుతూ.. కెసిఆర్ కి చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు పథకంలో మూడు లక్షల రూపాయలు తిన్న ఎమ్మెల్యేలను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. స్వయంగా ముఖ్యమంత్రే ఎమ్మెల్యేలు వారి అనుచరులు దళిత బందులో చేతివాటం చూపారని అన్నారు అంటే ఇందులో ఏ మేరకు అవినీతి జరిగిందో అర్థం అవుతుందన్నారు. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మద్యం మాఫియా లాగా.. ఇప్పుడు దళిత బంధు అవినీతికి అడ్డాగా మారిందని విమర్శించారు.

అలాగే ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందిస్తూ..దళిత బంధు పథకంలో అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేల పేర్లను సీఎం కేసీఆర్ ఏసీబీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలలో స్కాంలు జరుగుతున్నాయని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ లో అవినీతి, ధరణిలో అవినీతి, మిషన్ కాకతీయలో అవినీతి, దళిత బంధులోనూ అవినీతి.. ఇలా ప్రభుత్వ పథకాలు అన్నింటిలో దోపిడీ జరుగుతుందన్నారు.