90 మంది స్పైస్ జెట్ పైలట్లపై డీజీసీఏ నిషేధం

బోయింగ్ మ్యాక్స్ విమానాలు నడపకుండా నిషేధం
తిరిగి శిక్షణ తీసుకోవాలని ఆదేశం

న్యూఢిల్లీ : బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను నడపకుండా స్పైస్ జెట్ కు చెందిన 90 మంది పైలట్లపై పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) నిషేధం విధించింది. ఈ విమానాలను నడిపే సామర్థ్యాలు వారిలో లేవని గుర్తించింది. అందుకే మరో విడత శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకునే వరకు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడపకుండా నిషేధం విధించింది.

దేశ పౌరవిమానయాన రంగంలో ఈ తరహా సంఘటన అరుదైనదే అని చెప్పుకోవాలి. డీజీసీ అరుణ్ కుమార్ దీనిపై స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతానికి అయితే బోయింగ్ మ్యాక్స్ విమానాలను నడపకుండా సదరు పైలట్లపై నిషేధం విధించాం. ఈ విమానాలను నడపడంలో వారు తిరిగి విజయవంతంగా శిక్షణ ముగించాల్సి ఉంటుంది. మళ్లీ లోపాలను గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.

కాగా, ఈ నిషేధం తమ కార్యకలాపాలపై ప్రభావం చూపించదని స్పైస్ జెట్ అధికార ప్రతినిధి తెలిపారు. ‘‘ప్రస్తుతం 11 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను నిర్వహిస్తున్నాం. వీటి కోసం 144 పైలట్లు అవసరం. మా వద్దనున్న 650 మంది పైలట్లలో నిషేధం తర్వాత కూడా 560 మంది పైలట్లు అందుబాటులో ఉంటారు’’ అని ప్రకటించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/