తెలంగాణలో విభేదాలపై బీజేపీ ఫోకస్

తెలంగాణ లో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీ లో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడం బిజెపి అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అందుకే ముందుగా నేతల మధ్య మనస్పర్థలను సద్దుమణిగేలా చూడాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ నేతలకు చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు. పదకొండు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులతో సమావేశం అనంతరం తెలంగాణ నేతలతో మాట్లాడారు.

కిషన్‌ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత జరిగిన ఈ తొలి భేటీ చాలా హాట్‌హాట్‌గా జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు బీఎల్‌ సంతోష్‌, ప్రకాష్‌ జవదేకర్‌, సునీల్ బన్సల్‌, తరుణ్‌చుగ్‌, ఈటలరాజేందర్, బండి సంజయ్‌, లక్ష్మణ్‌, వివేక్‌, డీకే అరుణ, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు.

ఈ మధ్య కాలంలో తెలంగాణ బీజేపీలో తలెత్తిన పరిణామాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. కొందరు నేతలు నేరుగా అధినాయకత్వాన్ని విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా వచ్చే ఎన్నికలు పార్టీ విజయం కోసం పని చేయాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు. అదే లక్ష్యంతో పని చేయాలి కానీ విభేదాలతో పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని హితవుపలికారు. ఎన్నికల కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలని నేతలకు నడ్డా ఆదేశించారు. వాటితో నిత్యం ప్రజల్లో ఉంటూ కేంద్రం చేపట్టిన పథకాలు వివరిస్తూనే ప్రజాసమస్యపై పోరాడాలని సూచించారు. అలాగే అసంతృప్తులను బుజ్జగించే పనిని ఈటెల రాజేందర్ కు అప్పగించారు. ఎన్నికల నిర్వహణ ఛైర్మన్‌గా ఉన్న ఈటల అసంతృప్త నేతలతో నేరుగా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.