డాక్టర్ అవతారమెత్తిన ఎమ్మెల్యే రోజా

ఎమ్మెల్యే రోజాలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. సమయాన్ని బట్టి ఆమె తనలోని ప్రత్యేకతను బయటపెడుతుంటుంది. సినీ నటిగా , రాజకీయ నేత గా , టీచర్ , క్రీడాకారిణి, యాంకర్ గా ఇలా ఎన్నో అవతారాలు ఎత్తిన ఈమె ..తాజాగా డాక్టర్ అవతారమెత్తింది. పుత్తూరు పరిధిలో ఎమ్మెల్యే రోజా ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా మెడలో స్టెతస్కోప్ వేసుకుని డాక్టర్‌గా మారారు. ఓ వృద్ధుడికి బీపీ చెక్‌ చేసి ఆరోగ్యకరంగా ఉండాలంటే తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.

డాక్టర్ కావాలనేది తన కోరిక అని.. ముఖ్యంగా తన ఇంట్లో వాళ్ల కోరిక అని చెప్పారు. తాను ఎయిర్ హోస్టెస్ అవుదామనుకున్నా.. ఇంట్లో వారి కోసం డాక్టర్ అవుదామని అనుకున్నానని చెప్పారు. పద్మావతి ఉమెన్స్ కాలేజీలో బైపీసీ స్టూడెంట్‌గా ఇంటర్ పాస్ అయ్యానని చెప్పారు. ఆ తర్వాత మెడికల్ సీటు కోసం ఎంట్రెన్స్ టెస్ట్ కూడా రాశానని రోజా చెప్పారు. కానీ అంతలోపే తనకు సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశం వచ్చిందని తెలిపారు. అలా సినిమాల్లోకి వెళ్లిపోయానని.. ఆ తర్వాత పాలిటిక్స్‌లోకి వచ్చానని అన్నారు. అలా వెళ్లిపోవడంతో డాక్టర్ కాలేకపోయానని చెప్పారు. కానీ ఆ సరదా ఈ రోజు తీర్చుకున్నానని అన్నారు.

ఇక పుత్తూరు పరిసర ప్రాంత ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. శిబిరంలో సుమారు 200 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు, మాత్రలు పంపిణీ చేశారు. సుభాషిణి ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ శ్రీధర్, డాక్టర్‌ సుభాషిణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.