మూడేళ్లలోనే రూ. 3 లక్షల కోట్ల అప్పు చేశారు: అచ్చెన్నాయుడు

ఒక్క అవకాశం అంటూ దరిద్రాన్ని తెచ్చుకున్నారు
ఓటీఎస్ పేరుతో రూ. 5 వేల కోట్లు వసూలు చేసేందుకు ప్లాన్ చేశారు..అచ్చెన్నాయుడు


అమరావతి: సీఎం జగన్ పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్క అవకాశం అంటూ దరిద్రాన్ని తెచ్చుకున్నారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రం రూ. 3 లక్షల కోట్లు అప్పు చేస్తే… మూడేళ్లు కూడా కాకుండానే జగన్ రూ. 3 లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. అసలు ఈ 3 లక్షల కోట్లలో లక్షన్నర కోట్లను మౌలిక సదుపాయాలకు ఖర్చు చేసి ఉంటే ఎంతో మందికి ఉపాధి లభించేదని అన్నారు. పాఠశాలల్లో నాడునేడు కార్యక్రమం పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని… రూ. 10 పనికి రూ. 100 కొట్టేశారని చెప్పారు. ఓటీఎస్ పేరుతో రూ. 5 వేల కోట్లు వసూలు చేసేందుకు ప్లాన్ చేశారని తెలిపారు.

పదో తరగతి పరీక్షలపై నారా లోకేశ్ నాయకత్వంలో టీఎన్ఎస్ఎఫ్ తిరుగులేని పోరాటం చేసిందని అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ పెట్టే కేసుల గురించి భయపడాల్సిన అవసరం లేదని… ఎన్ని కేసులు పెడితే అంత పెద్ద నాయకుడని అనుకోవాలని చెప్పారు. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా టీడీపీ 150 సీట్లు గెలుస్తుందని అన్నారు. మారువేషంలో వెళ్లి ఏ వైసీపీ ఎమ్మెల్యేని అడిగినా వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే అని చెపుతారని తెలిపారు. నాలుగున్న లక్షల ఉద్యోగాలు ఇస్తామని గతంలో చెప్పిన జగన్… ఇప్పుడు జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చారని మండిపడ్డారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/