కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ నేతలతో ఆట మొదలుపెట్టిందా..?

గత పదేళ్లుగా బిఆర్ఎస్ నేతలు ఆడిందే ఆట..పాడిందే పాట గా సాగింది. ఈ పదేళ్లలో వారి ఇష్టారీతిలో వ్యహరించారు. అధికారం అడ్డుపెట్టుకొని ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు కట్టకుండా ఉండడం..భూములు కబ్జా చేయడం వంటివి చేసారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పదేళ్ల పాటు బిఆర్ఎస్ చేసిన అవినీతిని, కబ్జాలను బయటపెట్టడం చేస్తుంది. మొన్న ఆర్మూర్​మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి లీజు వ్యవహారం, నిన్న మల్లారెడ్డి భూముల రిజిస్ట్రేషన్లపై కేసులు నమోదు అయ్యాయి. రేపు ఎవరి మీద కేసులు నమోదు అవుతాయో అనే టెన్షన్ వారిలో మొదలైంది.

పదేళ్ల లో బీఆర్ఎస్ లీడర్లలో చాలా మందిపై భూ కబ్జా ఆరోపణలు వచ్చినా, పోలీసు స్టేషన్లకు ఫిర్యాదులు వెళ్లినా వాటిపై కేసులు నమోదు కాలేదు. దర్యాప్తు కూడా మొదలవ్వలేదు. ఇప్పుడు అలాంటి అంశాలన్నీ తెరపైకి వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి లీజుకు తీసుకున్న భూముల వ్యవహారంతో మొదలైన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ప్రస్తుతం మాజీ మంత్రి మల్లారెడ్డి దాకా వచ్చింది. రానున్న రోజుల్లో మరికొందరిపైనా ఎంక్వయిరీ మొదలు పెట్టేందుకు కాంగ్రెస్ సర్కారు కసరత్తు మొదలుపెట్టింది.