7 సెక్షన్ల కింద రాజధాని రైతులపై కేసులు నమోదు

కృష్ణాయపాలెంకు చెందిన 426 మంది రైతులపై పోలీసు కేసులు

Amaravati farmers
Amaravati farmers

అమరావతి: ఏపి రాజధాని గా అమరావతినే కొనసాగించాలని అక్కడి రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత 65 రోజులుగా రైతులు, మహిళలు అమరావతిని రక్షించాలంటూ దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆందోళనలు తెలిపేందుకుఅనుమతులు లేవంటూ ఈ నిరసనలను పోలీసులు అడ్డుకుంటుంటే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. తాజాగా మరో రకమైన నిరసన వ్యక్తమైంది. బుధవారం తహశీల్దార్ వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చెయ్యాల్సిందేననీ, ఇలా వాహనాల్లో తిరిగితే సరిపోదనీ, తమను పట్టించుకోని నేతలు, అధికారులను అడ్డుకుంటామని రైతులు ప్రకటించారు. అప్రమత్తమైన పోలీసులు రైతుల్ని నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కొంత ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఐతే… దాదాపు 500 మంది రైతులు వాహనం ఎలా ముందుకెళ్తుందో చూస్తామంటూ… రోడ్డుపైనే బైటాయించడంతో… పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. తాజాగా కృష్ణాయపాలెం‌కి చెందిన 426 మంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మంగళగిరి రూరల్ పోలీస్‍స్టేషన్‍లో ఈ కేసులు నమోదయ్యాయి. వాహనాన్ని అడ్డుకోవడం, పబ్లిక్ న్యూసెన్స్ సహా 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే రైతులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/