ఏపీలో టెన్త్‌, ఇంటర్ పరీక్షలు రద్దు

సుప్రీంకోర్టు సూచనతో పరీక్షలు రద్దు

అమరావతి: ఏపీ ప్రభుత్వం బోర్డు పరీక్షల అంశంలో ఎట్టకేలకు మనసు మార్చుకుంది. సుప్రీంకోర్టు తీవ్ర స్పందన నేపథ్యంలో, రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయ లోపం లేదని, అన్ని నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు ప్రయత్నించామని చెప్పారు. అయితే, సుప్రీంకోర్టు సూచన మేరకు పరీక్షలు రద్దు చేస్తున్నామని, విద్యార్థులు నష్టపోకూడదనే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని, జులై 31 లోపే ఫలితాలు ప్రకటించడం ఆచరణలో కష్టమని అభిప్రాయపడ్డారు. టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు ఎలా ఇవ్వాలన్న దానిపై విధివిధానాల రూపకల్పనకు హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇతర బోర్డు పరీక్షల రద్దుతో మన విద్యార్థులకు నష్టం జరగదని భావిస్తున్నామని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/