దేశీయ ఎంటర్​టైన్మెంట్​ మీడియా వ్యాపారంలో భారీ ఒప్పందం

దేశీయ ఎంటర్​టైన్మెంట్​ మీడియా వ్యాపారంలో భారీ ఒప్పందం

ప్రముఖ జీ ఎంటర్​టైన్మెంట్​ లిమిటెడ్​, సోనీ పిక్చర్స్​తో విలీన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో ఇరు కంపెనీలు లీనియర్​ నెట్​వర్క్​లు, డిజిటల్ ఆస్తులు, నిర్మాణ వ్యవహారాల వంటివి ఒక చోటుకు చేరనున్నాయి. ఇందులో సోనీ పిక్చర్స్​ 1.57 బిలియన్​ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. విలీనం తర్వాత ఏర్పడే కొత్త సంస్థలో సోని పిక్చర్స్​కు 52.93 శాతం వాటా, జీ ఎంటర్​టైర్మెంట్​ చేతికి 47.07 శాతం వాటా దక్కనున్నట్లు సమాచారం.

ఈ డీల్ వార్తలతో జీ ఎంటర్​టైన్మెంట్ ఎంటర్​ప్రైజెస్​ షేర్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. బీఎస్​ఈలో సంస్థ షేరు 21 శాతానికిపైగా పెరిగి.. రూ.310 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉంటె జీ ఎంటర్‌టైన్‌మెంట్, డిష్‌ టీవీ తదుపరి జీ లెర్న్, జీ మీడియాలపై సుభాష్‌ చంద్ర కుటుంబానికి వాటాదారుల నుంచి అసమ్మతి సెగ తగలనున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈజీఎం ఏర్పాటుకు వాటాదారులు పట్టుబట్టే అవకాశమున్నట్లు అభిప్రాయపడుతున్నారు. అయితే జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో సుభాష్‌ చంద్ర వాటా 3.99 శాతమేకాగా.. జూన్‌కల్లా జీ లెర్న్‌లో 21.69 శాతం, జీ మీడియా కార్పొరేషన్‌లో 14.72 శాతం చొప్పున ప్రమోటర్లు వాటాను కలిగి ఉన్నారు.