పయ్యావుల కేశవ్ పై మండిపడ్డ బుగ్గన

ప్రతిపక్షం నిజాలు తెలుసుకుని మాట్లాడాలి
బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది అవాస్తవం..మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ పై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ఆడిట్ చేసే సమయంలో పలు రకాల ప్రశ్నలు వేయడం సహజమని.. ఆ ప్రశ్నలనే ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఏవైనా సందేహాలు ఉంటే సమావేశమై పరిష్కరించుకోవచ్చని, గవర్నర్ కు లేఖలు రాయడం, మీడియా సమావేశాలను నిర్వహించడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బిల్లులు లేకుండానే డబ్బులు చెల్లించారనే ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. రూ. 41 వేల కోట్లకు పూర్తి లెక్కలు ఉన్నాయని తెలిపారు. నిజాలు తెలుసుకుని ప్రతిపక్షం మాట్లాడాలని హితవు పలికారు. వేల కోట్ల అవకతవకలు జరిగితే సంబంధిత వ్యవస్థలు చూసుకోకుండా ఉంటాయా? అని ప్రశ్నించారు. రూ. 41 వేల కోట్ల బిల్లుల చెల్లింపులపై ఆడిట్ సంస్థ వివరణ కోరిందని… అన్ని వివరాలను ఏజీ కార్యాలయానికి అందిస్తామని చెప్పారు. ఈ గందరగోళానికి సీఎఫ్ఎంఎస్ వ్యవస్థే కారణమని… 2018లో ఈ వ్యవస్థను టీడీపీ ప్రభుత్వమే ప్రారంభించిందని అన్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఈ వ్యవస్థను పెట్టారని విమర్శించారు. చెల్లింపులన్నీ కేంద్రీకృతం కావడమే సమస్యకు కారణమవుతోందని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/