తెలంగాణ ఇన్‌చార్జ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్

తమిళిసై సౌందరరాజన్ రాజీనామాతో ఖాళీ అయిన తెలంగాణ గవర్నర్ పోస్టులో ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఇన్‌చార్జ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు ఉదయం రాజ్‌భవన్‌లో ప్రధాన న్యాయమూర్తి లోక్‌ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, రాష్ట్ర సీఎస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ పనిచేసిన నేపథ్యంలో రాధాకృష్ణన్‌కు కూడా ఆ బాధ్యతలు అప్పగించారు.

కాగా, రాధాకృష్ణన్ గతేడాది ఫిబ్రవరిలో ఝార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ గతంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు నియమితులైన గవర్నర్లు అందరూ తమిళనాడు వారే కావడం గమనార్హం. ప్రమాణస్వీకారోత్సవం అనంతరం ఇన్‌ఛార్జ్ గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సమస్యలపై రాధాకృష్ణన్ కు సీఎం రేవంత్ వివరించినట్లు తెలుస్తోంది.