అంగరంగవైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

ప్ర‌భుత్వం త‌ర‌పున‌ అమ్మ‌వారికి ప‌ట్టు వ‌స్ర్తాలు సమర్పించిన మంత్రులు

హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా జ‌రిగింది. మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ క‌లిసి ప్ర‌భుత్వం త‌ర‌పున‌ అమ్మ‌వారికి ప‌ట్టు వ‌స్ర్తాలు స‌మ‌ర్పించారు. అమ్మ‌వారి క‌ల్యాణాన్ని తిల‌కించేందుకు మంత్రులు త‌మ‌ కుటుంబ స‌మేతంగా వ‌చ్చారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా క‌ల్యాణ వేడుక‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, కార్పొరేటర్‌ కేతినేని సరళ, మాజీ కార్పొరేటర్‌ ఎన్‌.శేషుకుమారి, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్య, డిప్యూటీ కమిషనర్‌ వంశీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.

కాగా, ఈ క‌ల్యాణ మ‌హోత్స‌వాన్ని తిల‌కించేందుకు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల నుంచి భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. భ‌క్తులు అమ్మ‌వారికి మొక్కులు స‌మ‌ర్పించుకున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/