డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఈసీ వేటు

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ సర్కార్ కు వరుస షాకులు ఇస్తుంది ఈసీ. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఈసీ వేటు వేస్తుంది. తాజాగా డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. డీజీపీని బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. విపక్షాల ఫిర్యాదులపై చర్యలు తీసుకుని తక్షణమే బదిలీ చేయాలని సీఎస్‌కు ఆదేశించింది. కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించి విధుల నుంచి తక్షణమే రిలీవ్‌ కావాలని ఆదేశించింది. సోమవారం ఉదయం 11 గంటలులోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని సీఎస్‌ జవహర్‌ రెడ్డిని ఈసీ ఆదేశించింది. వీరందరికీ సంబంధించిన ఐదేళ్ల పనితీరు నివేదిక, విజిలెన్సు క్లియరెన్సు నివేదికల్ని కూడా కమిషన్‌కు పంపించాల్సిందిగా సూచించింది.

డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని గత కొంతకాలంగా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువలో తనపై జరిగిన దాడిపై అనకాపల్లి లోక్‌సభ కూటమి అభ్యర్థి సీఎం రమేష్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరుగుతున్నా పోలీసులు పక్కనే ఉండి పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా సరైన సమయానికి తగిన బలగాలను పంపలేదని తెలిపారు. రాజేంద్రనాథ్‌ రెడ్డి అసమర్థతే పోలీసుల నిర్లక్ష్యానికి కారణమని ఆయన ఆరోపించారు. డీజీపీ ముఖ్యమంత్రికి బంధువని, అందుకే విపక్షాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనిపై ఈసీ స్పందిస్తూ..రాజేంద్రనాథ్‌రెడ్డి వేటు వేసింది.