వైస్సార్సీపీ కి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రాజీనామా

అధియాక్ర పార్టీ వైస్సార్సీపీ కి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పార్టీ కి రాజీనామా చేసారు. వైస్సార్సీపీ కి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కొంతకాలంగా పెందుర్తి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీలో వర్గపోరు నడుస్తోంది. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, పంచకర్ల మధ్య సీట్ వార్ నడుస్తోంది. ఇటీవల పెందుర్తిలో జరిగిన పరిమాణాలతో రమేష్‌బాబు అసంతృప్తితో ఉన్నారు. ఆయన మీడియా సమావేశం నిర్వహించి తన నిర్ణయాన్ని ప్రకటించారు.

పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. అధ్యక్షుడుగా ఎవరికైనా పదవుల్లో న్యాయం జరగకపోతే క్షమాపణ కోరుతున్నానని అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. చాలా బాధగా ఉందని అన్నారు. ఏడాది కాలంగా ఎన్నో సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించానని చెప్పారు. అందుకు వీలు కాలేదని , క్షేత్రస్థాయిలో సమస్యలను తీర్చలేనప్పుడు పదవిలో ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. తనకు, ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఎలాంటి విబేధాలు లేవని పేర్కొన్నారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన రమేష్ బాబు రెండు దశాబ్దాల క్రితం వైజాగ్‌కు వలస వచ్చి వ్యాపారంలో స్థిరపడ్డాడు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ టిక్కెట్‌పై పెందుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పీఆర్‌పీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో.. ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి టీడీపీ పార్టీలో చేరారు. అయితే 2020లో పంచకర్ల రమేష్ బాబు వైస్సార్సీపీ గూటికి చేరారు. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనను వైస్సార్సీపీ తీసుకురావడంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, అప్పుడు మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించారు.