ఢిల్లీ మేయ‌ర్‌గా ఆప్ అభ్య‌ర్ధి షెల్లీ ఒబెరాయ్‌

150 ఓట్లతో మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం

shelly-oberoi-elected-as-delhi-mayor

న్యూఢిల్లీః ఢిల్లీ మేయ‌ర్ పీఠం ఆప్‌కే ద‌క్కింది. బీజేపీపై చేప‌ట్టిన ఆమ్ ఆద్మీ పోరాటం ఫ‌లించింది. ఈరోజు జ‌రిగిన పోలింగ్‌లో ఢిల్లీ మేయ‌ర్‌గా ఆప్ అభ్య‌ర్ధి షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు. ఢిల్లీ మున్సిప‌ల్ హౌజ్‌లో జ‌రిగిన స‌మావేశంలో .. బిజెపికి 116 ఓట్లు పోల‌వ్వ‌గా.. ఆప్‌కు 150 ఓట్లు ప‌డ్డాయి. మేయ‌ర్‌గా ఎన్నికైన షెల్లీ ఒబెరాయ్‌కు డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా కంగ్రాట్స్ తెలిపారు. ట్విట్ట‌ర్‌లో ఆయ‌న విషెస్ పోస్టు చేశారు.

మేయ‌ర్ ఎన్నిక విష‌యంలో ఇప్ప‌టికే మూడుసార్లు మున్సిప‌ల్ స‌మావేశం వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. ఆప్‌, బీజేపీ మ‌ధ్య వాగ్వాదం వ‌ల్ల .. మేయ‌ర్ ఎన్నిక ర‌స‌వ‌త్త‌రంగా మారింది. అయితే ఇవాళ నాలుగోసారి స‌మావేశ‌మైన ఎంసీడీ.. చివ‌ర‌కు పోలింగ్ నిర్వ‌హించింది. బిజెపి ఎంపీ మీనాక్షి లేఖి, హ‌న్స‌రాజ్‌లు తొలుత ఓటేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు మేయ‌ర్ ఎన్నిక‌ను నిర్వ‌హించారు.

కాగా, షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆమె ఇండియన్ కామర్స్ అసోసియేషన్ జీవితకాల సభ్యురాలు కూడా. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుండి ఒబెరాయ్ పీహెచ్‌డీ చేశారు. ఐసీఏ కాన్ఫరెన్స్‌ నుంచి గోల్డ్‌ మెడల్‌ను అందుకున్నారు. పలు దేశీయ,అంతర్జాతీయ సదస్సుల నుంచి ప్రశంసలు సైతం దక్కించుకున్నారు.