ఇప్పటం లో మరో వివాదం..

ఏపీలోని ఇప్పటం గ్రామం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇప్పటంలో కొన్ని ఇళ్ల ప్రహారీలను మార్కింగ్ చేసిన ఆర్ అండ్ బి సిబ్బంది తొలగించారు. ఈ వ్యవహారం రాజకీయంగా వేడి పుట్టించింది. కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చేశారంటూ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ గ్రామాన్ని సందర్శించడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. గతంలో జనసేన సభకు ఆ గ్రామస్థులు స్థలాన్ని ఇచ్చినందుకు కక్షతో ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఇళ్లను కూల్చేసిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

జనసేన, టీడీపీ ఆరోపణలు ఇలా ఉంటే..ప్రభుత్వం మాత్రం ఒక్క ఇంటిని కూడా కూల్చలేదని..కేవలం ప్రహారీ గోడల్ని కూల్చామని స్పష్టం చేసింది. జనసేన, టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అటు అధికారులు కూడా స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్..రోడ్డు విస్తరణలో కూల్చేసిన ఇళ్లకు లక్ష రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ప్రకటించడంతో ఇప్పుడు ఆ గ్రామంలో ఆధిపత్యపోరు నెలకొంది. కొత్తగా ఆ ఊరిలో ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రభుత్వం తమ ఇళ్లను కూల్చలేదని..ఎవరి సానుభూతి తమకు అవసరం లేదని, డబ్బులిచ్చి అబద్ధాన్ని నిజం చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ ఫ్లెక్సీలు గ్రామంలో వైరల్ గా మారాయి. ఈ ఫ్లెక్సీల్ని వైస్సార్సీపీ పార్టీ సానుభూతిపరులే ఏర్పాటు చేశారని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి ఇప్పటం పేరు మాత్రం మీడియా లో తెగ వినపడుతుంది.