జగన్ సర్కార్ ఫై వేమన పద్యాలతో పవన్ కళ్యాణ్ ఫైర్

ఏపీలో జనసేన vs వైస్సార్సీపీ వార్ నడుస్తుంది. ఇప్పటం వ్యవహారం తో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ తరుణంలో మరోసారి జగన్ సర్కార్ ఫై జనసేన అధినేత విరుచుకపడ్డారు. కడప జిల్లా యోగి వేమన యూనివర్శిటీలో ఉన్న వేమన విగ్రహాన్ని తొలిగించి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస యోగి వేమన పద్యాలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

‘విద్యలేనివాడు విద్వాంసుచేరువనుండగానే పండితుండుగాడు.. కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు..విశ్వదాభిరామ! వినుర వేమ!. తాత్పర్యం: విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం’అంటూ పద్యంతో పాటూ తాత్పర్యాన్ని ప్రస్తావించారు.

‘ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు.. పరగ మూలికలకు పనికివచ్చు. నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు?.. విశ్వదాభిరామ! వినుర వేమ! తాత్పర్యం: విష వృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి.దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగ-పడడు,అంతేకాదు హాని కూడా చేస్తాడు’అంటూ మరో ట్వీట్ చేశారు.

దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2006లో వేమన పేరుతో కడపలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆయన గొప్పతనాన్ని చాటేలా ప్రధాన పరిపాలన భవనం ముందు వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు యూనివర్శిటీ అధికారులు ఆ విగ్రహాన్ని తొలగించి , ఆ స్థానంలో వైఎస్‌ విగ్రహం ఏర్పాటు చేశారు. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.