పదేళ్లలో బిఆర్ఎస్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు – రేవంత్

బిఆర్ఎస్ పార్టీ ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు గుప్పించారు. డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాలు, కాలేజీలు తెస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటూ రావడమే కానీ.. పదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని రేవంత్ మండిపడ్డారు.

ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో కాంగ్రెస్ నేతలు తమ దూకుడును మరింత పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు రేవంత్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే హామీలను వివరిస్తూ..పదేళ్ల లో బిఆర్ఎస్ చేసింది ఏమిలేదని విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. తాజాగా వికారాబాద్‌ జిల్లా దౌలతాబాద్‌ లో విజయభేరి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ..నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పూర్తి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు. నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా.. మన ప్రాంతాన్ని పాడు చేశారని ధ్వజమెత్తారు. దౌల్తాబాద్‌లో ఇక్కడ కట్టిన బడి, గుడి, తాగునీరు అన్నీ తాను తీసుకొచ్చినవేనని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ , మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని.. రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.

డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాలు, కాలేజీలు తెస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పారని, పదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. కానీ మళ్లీ గెలిపించాలని అడుగుతున్నారని రేవంత్ విమర్శించారు.