లిక్కర్ స్కాంలో విజయసాయి రెడ్డి అల్లుడు అరెస్ట్ ఫై టీడీపీ నేత కామెంట్స్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. మరో ఇద్దరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు విజయసాయి రెడ్డి అల్లుడు అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డి కాగా మరొకరు జీఎం వినయ్ బాబు. శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ అంశంపై టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ… ఈడీ అరెస్ట్ చేసిన శరత్ చంద్రారెడ్డి ఎవరో కాదని… ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జగన్ రెడ్డి రైట్ హ్యాండ్, ఉత్తరాంధ్రలో వేల ఎకరాలను కబ్జా చేస్తున్న వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అల్లుడి అన్న అని తెలిపారు.

శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేయడంపై వైస్సార్సీపీ నేతలు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. మద్య నిషేధంపై గొప్పలు చెప్పే జగన్ ఈ అరెస్ట్ పై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం అయిన తర్వాత అంచెలంచెలుగా మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. మూడున్నరేళ్లుగా శాండ్, మైన్, వైన్, ఇసుక, మద్యం, బియ్యం, అంబులెన్స్ మాఫియాలు నడిపిన జగన్ రెడ్డి వైద్య రంగం, ప్రజారోగ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. కోవిడ్ సమయంలో రోగులకు భోజనం సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని జగన్ రెడ్డి ప్రజారోగ్యం కాపాడతారా? అని అనురాధ ఎద్దేవా చేశారు. చివరకు కోవిడ్ మరణాలపైనా తప్పుడు లెక్కలు చెప్పి కోట్లు స్వాహా చేసిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదని దుయ్యబట్టారు.

ఇక శరద్ చంద్రారెడ్డి, వినోయ్ బాబుకు కోట్లాది రూపాయల మద్యం వ్యాపారం ఉందని సిబిఐ తెలిపింది. అరబిందో ఫార్మా కంపెనీలో కీలక డైరెక్టర్ గా ఉన్నారు శరద్ చంద్రారెడ్డి. అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు డైరెక్టరుగా ఉన్నారు శరత్ చంద్రారెడ్డి. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ను ఎఫ్‌ఐఆర్‌ లో చేర్చింది సిబిఐ. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పెన్నాక శరత్ చంద్రారెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది సిబిఐ. ఢిల్లీ లిక్కర్ పాలసికి అనుగుణంగా ఈఎండీలు శరత్ చంద్రారెడ్డి చెల్లించినట్లు గుర్తించింది. సెప్టెంబర్ 21,22,23 తేదీల్లో ఢిల్లీలో శరత్ చంద్రారెడ్డిని ప్రశ్నించారు ఈడి అధికారులు. గత మూడు రోజులుగా ఢిల్లీలో ప్రశ్నించారు. తాజాగా అరెస్ట్ చేశారు.