వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జ్ మార్పు ఫై ఆనం రామనారాయణరెడ్డి కామెంట్స్

వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జ్ మార్పు ఫై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ఈ మధ్య వైస్సార్సీపీ నేతలే..సొంత పార్టీ ఫై నిప్పులు చెరుగుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల్లోకి వెళ్తుంటే సిగ్గేస్తుందని , ఏంచేశామని వారి దగ్గరికి వెళ్లాలని పబ్లిక్ గానే కొంతమంది నేతలు చెప్పడం జరిగింది. ఇక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అయితే గత కొద్దీ రోజులుగా పబ్లిక్ గానే సొంత పార్టీ పై విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ఈ మధ్యనే నెల్లూరు జిల్లా రాపూరులో వాలంటీర్లు, కన్వీనర్ల సమావేశంలో ఆనం మాట్లాడుతూ..’రోడ్లులో గుంతలు కూడా పూడ్చలేకపోతున్నాం.. తాగడానికి నీళ్లు ఇవ్వలేకపోతున్నాం.. కేంద్ర ప్రభుత్వం జలజీవన మిషన్ కింద నిధులు ఇస్తారు. అప్పుడు నీళ్లు ఇస్తామని చెప్పుకోవాల్సి న పరిస్థితి వస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే.. మీరేం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారని..వారి మాటలకు సిగ్గేస్తుందని ఆనం అన్నారు.

‘ఈ నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు వేయమని ఎలా అడగాలి. ప్రాజెక్టులు ఏమన్నా కట్టామా. ఏ పనైనా మొదలుపెట్టామా. శంకుస్థాపన ఏమన్నా చేశామా. ప్రజలను ఏమని ఓట్లు అడగాలి. కేవలం పింఛన్లు ఇస్తే ఓట్లు వేసేస్తారా. గత ప్రభుత్వం కూడా పింఛన్లు ఇచ్చింది. వాళ్లకు ప్రజలు ఓట్లు వేశారా. ఇళ్లు కడతామని లేఔట్ వేశాం. ఇళ్లు ఎక్కడైనా కట్టామా’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు పార్టీ లో పెద్ద దుమారమే రేపాయి.

ఈ వ్యాఖ్యలు ఇంకా మరచిపోకముందే ఈరోజు మరోసారి పలు వ్యాఖ్యలు చేసారు. ఆనం ఫై సీఎం జగన్ ఆగ్రహంతో ఉన్నారని , ఆయనపై వేటు వేశారని, వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జ్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని సీఎం జగన్ నియమిస్తారని ప్రచారం జరుగుతుంది ఇది నిజమేనా అని మీడియా వారు ఆనం ను ప్రశ్నించగా.. ఊహాగానాలను తాను పట్టించుకోనని, టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో జరిగే ప్రచారంపై స్పందించనని స్పష్టం చేశారు. వెంకటగిరి ఇంచార్జ్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమిస్తున్నట్టు తనకు సమాచారం లేదని తెలిపారు. పార్టీ నుంచి తనతో ఎవరూ మాట్లాడలేదని వెల్లడించారు.

మీడియా మిత్రులు ఫోన్ చేసి, వెంకటగిరికి వేరొకరని ఇన్చార్జిగా నియమిస్తున్నారట కదా… మీకేమైనా సమాచారం ఉందా? అని అడిగారని ఆనం వెల్లడించారు. అయితే పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వాళ్లకు చెప్పానని వివరించారు. ఎవరిని నియమిస్తారన్నది పార్టీ ఇష్టం అని అభిప్రాయపడ్డారు. ఏం జరుగుతుందో చూద్దాం అంటూ ఆనం వ్యాఖ్యానించారు.