నువ్వు పెరగవు, ఇంకొకడ్ని పెరగనివ్వవుః అంబటి రాంబాబు

చంద్రబాబు, పవన్ లపై మంత్రి అంబటి ధ్వజం

ambati-rambabu-take-a-jibe-at-chandrababu-and-pawan-kalyan

అమరావతిః ఏపీ మంత్రి అంబటి రాంబాబు, టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై ధ్వజమెత్తారు. చంద్రబాబు దళిత ద్రోహి అని, పవన్ కల్యాణ్ కూలీ నెంబర్ వన్ అని అభివర్ణించారు. నువ్వు పెరగవు, ఇంకొకడ్ని పెరగనివ్వవు అంటూ పవన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నాళ్లయింది… ఇంకా నోట్ల వేలేసుకుని చంద్రబాబు చేయి పట్టుకుని తిరుగుతున్నావు అంటూ వ్యాఖ్యానించారు. 2014లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చావు… అప్పటి నుంచి ఇప్పటివరకు ఏమైనా పెరిగావా… ఇంకా తగ్గిపోయావు, మరగుజ్జు వేషాలు వేస్తున్నావు అంటూ విమర్శించారు.

చంద్రబాబు పచ్చజెండా ఊపితేనే వారాహి వాహనం కదులుతుంది, చంద్రబాబు రెడీ అంటేనే నువ్వు ప్రచారానికి వస్తావు ఎద్దేవా చేశారు. ఆడవాళ్లు బంగారంతో వడ్డాణం చేయించుకున్నట్టుగా పవన్ వారాహి వాహనం చేయించుకుని ఇంట్లో దాచుకున్నాడని అంబటి వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ దేశంలో రాజకీయాలకు అనర్హుడు ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కల్యాణ్ మాత్రమేనని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను నమ్మితే సర్వనాశనమేనని పేర్కొన్నారు. దళితులను మోసం చేస్తున్న చంద్రబాబుకు జనసేన, పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వడం దురదృష్టకరమని అన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాల పట్టాలు ఇస్తుంటే, శవాలు పూడ్చుకోవడానికా సెంటు భూమి? సమాధులు కట్టుకోవడానికి సెంటు భూమి? అని దుర్మార్గంగా మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి జరిగే ఎన్నికలు పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగే సంగ్రామం అని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచేది పేదలు, జగన్ మోహన్ రెడ్డేనని, ఈ మాట రాసుకోండి అంటూ ధీమా వ్యక్తం చేశారు.