రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు సర్వం సిద్ధం..శవపేటికపై 2,868 విలువైన వజ్రాలు

బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. . గత ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్న క్వీన్ ఎలిజబెత్.. చికిత్స పొందుతూ స్కాట్ లాండ్ లోని బాల్మోరల్ కోటలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సోమవారం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. రాచరికపు సంప్రదాయాలతో వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచారవ్యవహారాలను పాటిస్తూ రాణికి తుది వీడ్కోలు పలకనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశారు.

రాణి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇప్పటికే వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు అక్కడకు చేరుకున్నారు. మన దేశం నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ కు చేరుకొని రాణి మృతదేహానికి నివాళులు అర్పించారు. ప్రస్తుతం వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉంచిన రాణి శవపేటికను రాయల్ నేవికి చెందిన గన్ క్యారేజ్‌లో సోమవారం వెస్ట్ మినిస్టర్ అబేకు మారుస్తారు. ఉదయం 6 గంటల నుంచి సందర్శనార్థం పెడతారు. 11 గంటల నుంచి అంత్యక్రియల కార్యక్రమం మొదలవుతుంది. అక్కడ వెస్ట్‌మినిస్టర్ డీన్ డేవిడ్ హోయల్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరుగుతాయి. సోమవారం మధ్యాహ్నం చివరగా విండ్సర్‌ క్యాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌కు రాణి శవపేటికను తీసుకువస్తారు. ఈ సెయింట్‌ జార్జ్‌ ఛాపెల్‌లోనే రాజ కుటుంబ వివాహాలు, అంత్యక్రియలు, క్రైస్తవ మత స్వీకరణ లాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి.

రాణి అంత్యక్రియల సందర్భంగా బ్రిటన్‌లో సోమవారం సెలవు ప్రకటించారు. 125 సినిమా థియేటర్లలో రాణి అంత్యక్రియలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అంతేకాదు పార్కులు, బహిరంగ స్థలాలలో కూడా ప్రదర్శించనున్నారు. రాణి అంత్యక్రియలకు 2000ల మంది ప్రముఖులు, అతిథులు హాజరు కానున్నారు. రాణి అంత్యక్రియల సందర్భంగా సుమారు పది లక్షల మంది ప్రజలు లండన్‌కు వచ్చే ఛాన్స్ ఉందని అంచనా, ఈ మేరకు 25 అదనపు రైళ్లను నడిపిస్తున్నారు. ఇక క్వీన్‌ ఎలిజబెత్‌ భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ను ఉంచిన దగ్గరే రాణి శవపేటికను ఉంచుతారు. ఆ శవపేటికపై 2,868 విలువైన వజ్రాలు, నీలమణులు, మరకత మణులు, ముత్యాలు, రూబీలు పొదిగిన రాణి కిరీటాన్ని ఉంచారు.