దేశంలో మార్పు కోసమే బిఆర్ఎస్ః సిఎం కెసిఆర్‌

దేశానికి కాంగ్రెస్ ఏంచేసింది.. కెసిఆర్‌

cm-kcr-attends-party-training-programme-in-nanded

నాందేడ్‌: మహారాష్ట్రలోని నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ కార్యకర్తల శిక్షణ శిబిరాన్ని సిఎం కెసిఆర్‌ ప్రారంభించారు. అనంతరం కెసిఆర్‌ మాట్లాడుతూ.. దశాబ్దాల కాలం పాటు పాలించిన కాంగ్రెస్ దేశానికి ఏమి చేసిందని ప్రశ్నించారు. చిన్న దేశాలైన సింగపూర్, మలేషియా అభివృద్ది చెందాయన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. మహారాష్ట్రలో వారానికోసారి తాగు నీరు వస్తుందంటూ.. పుష్కలంగా నీరు ఉన్నా వాడుకోలేని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు.

దేశం మొత్తం మార్పు తీసుకురావాడానికే బిఆర్ఎస్ ఆవిర్భవించిందని కెసిఆర్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా సమస్యలు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత అనేక పరిష్కరించామన్న కెసిఆర్.. తెలంగాణలో సాధ్యమైనప్పుడు దేశంలో ఎందుకు సాధ్యం కావడం లేదన్నారు. మహారాష్ట్రలో త్వరలోనే బిఆర్ఎస్ పార్టీ కమిటిలు ఏర్పాటు చేస్తామన్నారు. కర్నాటక ఫలితాలు వచ్చిన తరువాత ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని అన్నారు. దేశంలో మార్పు తీసుకురావడానికి మహారాష్ట్ర నాంది కావాలని స్పష్టంచేశారు.

రెండు రోజుల శిక్షణ అనంతరం నియోజకవర్గాలవారీగా పార్టీ ప్రచార సామగ్రి.. కరపత్రాలు, గులాబీ కండువాలు, టోపీలు, వాల్‌పోస్టర్లను పార్టీ బాధ్యులకు అందజేస్తారు. వాటితోపాటు నెలరోజులపాటు చేపట్టనున్న పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన పుస్తకాలను కూడా నియోజకవర్గాలవారీగా పంపిణీ చేస్తారు. మహారాష్ట్ర స్థానిక కళా సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటలు, వివిధ కళారూపాలకు సంబంధించిన సాంస్కృతిక బాండాగారాన్ని సైతం పెన్‌డ్రైవ్‌ల రూపంలో అందజేయనున్నారు.