అలా నిరూపిస్తే పదవిని తృణప్రాయంగా వదిలేస్తా: మంత్రి అంబటి

ambati rambabu
ambati rambabu

అమరావతి : ఏపీ లో మంత్రి అంబటి రాంబాబుకు, జనసేనకు మధ్య రాజకీయం తారాస్థాయికి చేరింది. రెండు వైపులా ఆరోపణలు, కౌంటర్లు కొనసాగుతున్నాయి. మంత్రి అంబటి రాంబాబు అవినీతికి పాల్పడుతున్నారని పవన్‌ ఆరోపణలు చేయడం, నిరూపించాలని అంబటి సవాల్‌ విసరడం, ఆ తర్వాత లబ్ధిదారులతో జనసేన నేతలు ప్రెస్‌ మీట్‌ పెట్టడం ఆసక్తిగా మారింది. రాజీనామాకు సిద్ధం అని అంబటి రాంబాబు సవాల్‌తో జనసేన నేతలు బాధితులతో ప్రెస్‌మీట్‌ పెట్టడంతో రాజకీయం మరింత రంజుగా మారింది. దీంతో విమర్శలు ప్రతివిమర్శలతో ఏపీ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.

సీఎం రిలిఫ్ ఫండ్ విషయంలో.. మంత్రి రెండున్నర లక్షలు ఇవ్వాలని బాధితులు చెప్పడంతో అంబటి రాంబాబును టార్గెట్ చేస్తూ జనసేన, టిడిపి తీవ్ర విమర్శలు గుప్పించాయి. నిన్న జనసేన నేతలు.. నాలుగు నెలల కిందట సత్తెనపల్లిలో జరిగిన వినాయక రెస్టారెంట్‌ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులతో ప్రెస్ మీట్ పెట్టారు. కొడుకును కోల్పోయిన కుటుంబం నుంచి మంత్రి అంబటి రాంబాబు రెండున్నర లక్షలు డిమాండ్‌ చేశారని, మరి ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తారని ప్రశ్నించారు. ఆ ప్రమాదంలో చనిపోయిన యువకుడి తల్లిదండ్రులతో మాట్లాడించారు జనసేన నేతలు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఐదు లక్షల పరిహారం వస్తే రెండున్నర లక్షల్ని మంత్రి డిమాండ్‌ చేశారని ఆరోపించారు చనిపోయిన యువకుడి తల్లి మంగమ్మ. ఛైర్‌పర్సన్‌ భర్త చల్లంచర్ల సాంబశివరావు ఫోన్‌ చేసి చెప్పారని.. దీంతో వైస్సార్సీపీ నేత పెండెం బాబూరావును తీసుకుని ఆయన దగ్గరకెళ్లామని చెప్పింది. రూ.5 లక్షల్లో రూ.2.50 లక్షలు ఇవ్వాలని చెప్పారని.. తన అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నామని చెప్పినా వినలేదన్నారు. న్యాయం చేస్తారని మంత్రి అంబటి రాంబాబును కలిస్తే సాంబశివరావుకు రూ.2.50 లక్షలు ఇవ్వాల్సిందేనంటూ వెల్లడించారని పేర్కొన్నారు. దీనిపై మంత్రి సమాధానం చెప్పాలని, బాధితులకు న్యాయం చేయాలని జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

జనసేన ఆరోపణలకు మళ్లీ రియాక్ట్‌ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు. వినాయక రెస్టారెంట్‌ ప్రమాదంలో ఇద్దరు కూలీలు, రెస్టారెంట్‌ యజమాని కూడా చనిపోయారని చెప్పారు. న్యాయం కోసం బాధితుల కుటుంబాలు డిమాండ్‌ చేస్తే యజమాని కుటుంబం నుంచి ఐదు లక్షల చొప్పున ఇప్పించామన్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి సాయం వచ్చాక వాటిని తిరిగి రెస్టారెంట్‌ యజమాని కుటుంబానికి ఇవ్వాలని ఆ రోజే చెప్పామన్నారు. ముగ్గురికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే అలా చేశామని అంబటి తెలిపారు. ఈ అంశాన్ని కావాలని రాజకీయం చేసి జనసేన చిల్లర రాజకీయం చేస్తోందని విమర్శించారు అంబటి రాంబాబు. ఇద్దరికి రూ.5లక్షలు చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిచ్చానని.. ఇందులో తాను శవాలపై పేలాలు ఏరుకోవటం ఏంటీ అంటూ ప్రశ్నించారు. మృతుల పరిహారం తీసుకునే దౌర్భాగ్యం తనకు లేదన్నారు. జనసేన తనపై దుర్భుద్దితో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తోందంటూ మండిపడ్డారు. రూ.2లక్షలు తీసుకున్నానని నిరూపిస్తే పదవిని తృణప్రాయంగా వదిలేస్తానంటూ అంబటి పేర్కొన్నారు.