జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి నిరసన సెగ

Protest against GHMC Mayor Vijayalakshmi

హైదరాబాద్ : హైదరాబాద్ చిలుకానగర్ డివిజన్ అభివృద్ధి పనుల శంకుస్థాపనలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ కు నిరసన సెగ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే లేకుండా చిలుకానగర్ డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎలా శంకుస్థాపన చేస్తారని కొందరు స్థానిక నాయకులు మేయర్ ను ప్రశ్నించారు. ఎమ్మెల్యే వచ్చే వరకూ ఆగాలన్నారు. దీంతో స్థానిక నాయకులపై ఫైర్ అయ్యారు మేయర్. జీహెచ్ఎంసీ నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు. దీనికి ఎవరి పర్మీషన్ అవసరం లేదని..ఎవరికీ చెప్పాల్సిన పని లేదని ఘాటుగా సమాధానం చెప్పారు. మేయర్ సమాధానంపై ఎమ్మెల్యే అనుచరులు, కొందరు స్థానికులు విజయలక్ష్మితో వాగ్వాదానికి దిగారు. ఆమె కూడా వారితో కొద్దిసేపు వారించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని..ఎమ్మెల్యే అవసరం లేకుండానే పనులు చేపడతామని..ఆయనతో తనకేంటి సంబంధం అనే విధంగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అనుచరులు, స్థానికులు మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేయర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నిరసనల మధ్యే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మేయర్.

కాగా, చిలుకానగర్ డివిజన్ అభివృద్ధి పనుల శంకుస్థాపనలో స్థానికులు తమ సమస్యలను మేయర్ విజయలక్ష్మికి వివరించారు. దీనిపై స్పందించిన ఆమె సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఉప్పల్లో రూ.2 కోట్ల విలువ గల పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు.