దీదీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు ట్వీట్ చేసిన కెటిఆర్

ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతోందని విమర్శ

KTR

హైదరాబాద్‌ః తాను దీదీ (మమతా బెనర్జీ) వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ I.N.D.I.A. కూటమిలో ఉన్నప్పటికీ బెంగాల్‌లో తాము 42 లోక్ సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు రెండు సీట్లు ఆఫర్ చేస్తే వద్దని చెబుతోందని…. అసలు ఆ పార్టీ దేశవ్యాప్తంగా కనీసం 40 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని మమతా బెనర్జీ విమర్శించారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే భారత్ జోడో న్యాయ్ యాత్రను వారణాసి సహా ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలో చేయాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ వారణాసి సహా పైరాష్ట్రాల్లో బిజెపిని ఓడించాలని చురక అంటించారు. ఈ వ్యాఖ్యలను కెటిఆర్ రీట్వీట్ చేస్తూ… దీదీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.

తాను దీదీ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. I.N.D.I.A. కూటమిపై తన ప్రభావం ఎలా ఉందో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌లలో బిజెపిని కాంగ్రెస్ నేరుగా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని… కానీ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట వారికి వ్యతిరేకంగా పోరాడుతోందని ఆరోపించారు. కెసిఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, తిరు స్టాలిన్ వంటి బలమైన నాయకుల నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలే బిజెపిని నిలువరించగలవన్నారు. బిజెపికి కాంగ్రెస్ పార్టీ సరైన ప్రత్యామ్నాయం కాదని తేలిపోయిందన్నారు.