వారణాసిలో బిజెపిని ఓడించే దమ్ము కాంగ్రెస్‌కు ఉన్నదా?: మమతాబెనర్జీ

Mamata doubts if Congress would win ‘even 40 seats’ in Lok Sabha polls, dares party to defeat BJP in Varanasi

కోల్‌కతా: కాంగ్రెస్‌ పార్టీపై పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ ప్రశ్నల వర్షం కురించారు. వారణాసిలో ప్రధాని మోడీని ఓడించే దమ్ము కాంగ్రెస్‌కు ఉన్నదా? అని ప్రశ్నించారు. ముర్షిదాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో మమత మాట్లాడుతూ ‘లోక్‌సభ ఎన్నికల్లో 300 స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్‌ చెప్తున్నది. ఈ 300 స్థానాల్లో కనీసం 40 చోట్లనైనా గెలుస్తుందన్న నమ్మకం నాకు లేదు. నిజంగా కాంగ్రెస్‌కు దమ్ము ఉంటే వారణాసిలో ప్రధాని మోడీని ఓడించాలి.

వారణాసి అనే కాదు.. అలహాబాద్‌.. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఎన్నిచోట్ల గెలువగలరో చెప్పే దమ్ము కాంగ్రెస్‌కు ఉన్నదా? గత లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన స్థానాల్లో కూడా ఈసారి కాంగ్రెస్‌ ఓడిపోతుంది. కాంగ్రెస్‌ పనైపోయింది’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన న్యాయ్‌యాత్రను ఉద్దేశించి మమత స్పందిస్తూ ‘ప్రస్తుతం కొత్త వేషగాళ్లు ఊర్లుపట్టుకొని తిరుగుతున్నారు. కనీసం చాయ్‌ దుకాణానికి వెళ్లడానికి ఇష్టపడనివాళ్లు ఇప్పుడు బీడీ కార్మికులతో ఫొటోలకు పోజులిస్తున్నారు. వారంతా వలస పక్షులు. ప్రస్తుతం నడుస్తున్నదంతా ఫొటోషూట్‌ మాత్రమే’ అని మమత ధ్వజమెత్తారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ మమతాబెనర్జీ కోల్‌కతాలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం, పీఎం ఆవాస్‌ యోజన ఇలా పలు పథకాలకు సంబంధించి కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయలు రాష్ర్టానికి రావాల్సి ఉన్నదని చెప్పారు. బకాయిలను విడుదల చేయాలంటూ ఇప్పటికే పలుసార్లు విజ్ఞప్తి చేశామని, అయినా కేంద్రం స్పందించడం లేదని పేర్కొన్నారు.