అధికారంలోకి రాగానే రైతుల సమస్యల పై ప్రత్యేక దృష్టిః లోకేష్

బైరెడ్డిపల్లె మండలంలోని గ్రామాల్లో రైతులు, భవన నిర్మాణ కార్మికులతో లోకేశ్ మాటామంతి

After coming to power, special focus on farmers’ problems: Lokesh

అమరావతిః టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఆరో రోజు పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. యాత్రంలో భాగంగా బైరెడ్డి పల్లె మండలంలోని గ్రామాల్లో పలువురితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సాకేఊరు లో చెరుకు రైతు వెంకట రమణ తో నారా లోకేష్ మాట్లాడారు. తనకి ఉన్న ఒకటిన్నర పొలం, బెల్లం గానుగ లోకేష్ కి చూపించి చెరుకు రైతులు పడుతున్న ఇబ్బందులు రైతు లోకేష్ దృష్టికి తెచ్చారు. చెరుకు రైతులు కనీస మద్దతు ధర లేక పడుతున్న ఇబ్బందులు తనకు తెలుసని లోకేశ్ అన్నారు. ‘వైఎస్‌ఆర్‌సిపిది రైతు వ్యతిరేక ప్రభుత్వం. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగుల మందు కారణంగా రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయానికి సాయం అందించడం నా బాధ్యత. టిడిపి అధికారం వచ్చిన వెంటనే చెరుకు రైతుల సమస్యల పై ప్రత్యేక దృష్టి పెడతాం. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తాం. కౌలు రైతులను ఆదుకుంటాం’ అని లోకేష్ చెప్పారు.

అనంతరం బేలుపల్లె లో పని చేసుకుంటున్న భవన నిర్మాణ కార్మికుల దగ్గర కు వెళ్లి పలకరించారు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది భవన నిర్మాణ కార్మికుడు ఫయాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాము అధికారంలోకి వచ్చాక పాత ఉచిత ఇసుక విధానం తీసుకొస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ‘భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఉన్న నిధులు కూడా ప్రభుత్వం పక్క దారి పట్టించింది. వైఎస్‌ఆర్‌సిపి నాయకులు ఇసుక అక్రమ రవాణా ద్వారా వేల కోట్లు సంపాదిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది’ అని లోకేష్ విమర్శించారు.

ఆ తర్వాత వాల్మీకి సామాజిక వర్గం ప్రతినిధులతో నారా లోకేష్ సమావేశం అయ్యారు. ‘వాల్మీకిలకు సీఎం జగన్ వెన్నుపోటు పొడిచారు. టిడిసి అధికారంలో ఉన్నప్పుడు సత్యపాల్ కమిటీ ఏర్పాటు చేసి వాల్మీకిల స్థితిగతుల పై అధ్యయనం చేసాం. వారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వాల్మీకిలను ఎస్టీ ల్లో చేర్చాలని 2017 లో అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం వద్దకు పంపాం. ప్రతిపక్షం లో ఉండి కూడా ప్రధాని మోడీ గారికి చంద్రబాబు గారు వాల్మీకి లను ఎస్టీల్లో చేర్చాలని పోరాడుతూ లేఖ రాశారు. వైఎస్‌ఆర్‌సిపి కి ఎక్కువ మంది ఎంపీలు ఉన్నా వాల్మీకి ల గురించి మాట్లాడటం లేదు. పోరాడటం లేదు. వాల్మీకి సోదరులకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించడం కోసం కంపెనీలు ఏర్పాటు చేస్తాం’ అని లోకేష్ పేర్కొన్నారు.