అందరూ శెభాష్ అనేలా ప్రజలకు సేవ చేస్తాః బాబూ మోహన్

Babu Mohan will contest on behalf of Praja Shanthi Party

హైదరాబాద్‌ః తాను పుట్టింది వరంగల్ లోనే అని… ఈ నగరంతో తనకు మంచి అనుబంధం ఉందని ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, సినీ నటుడు బాబూ మోహన్ తెలిపారు. వరంగల్ కు ఎప్పుడు వచ్చినా తన అడ్డా కరుణపురం అని చెప్పారు. వరంగల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా తాను తొలిసారి కరుణపురం చర్చికి వెళ్లానని తెలిపారు. హనుమకొండ జిల్లా ములుగు రోడ్డులోని శ్రీసాయి కన్వెన్షన్ హాల్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజాశాంతి పార్టీ నుంచే తాను ఎంపీగా పోటీ చేస్తానని బాబూ మోహన్ తెలిపారు. తాను వేరే పార్టీ నుంచి పోటీ చేస్తానని కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. చీప్ రాజకీయాలు చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ ప్రజలు తనను గెలిపించాలని… అందరూ శెభాష్ అనేలా ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ మాదిరి తమ అధినేత కేఏ పాల్ అబద్ధాలు చెప్పరని అన్నారు. టికెట్ ఇస్తామని చెప్పి బిజెపి నేతలు మోసం చేశారని విమర్శించారు. తాను గెలిచిన తర్వాత పేదలందరికీ పింఛన్లు ఇప్పిస్తానని చెప్పారు. ఉచిత విద్య, వైద్యం ఇప్పిస్తానని అన్నారు.