జగన్ కు పోలీసులుంటే.. నాకు ప్రజలు ఉన్నారు – చంద్రబాబు

జగన్ కు పోలీసులు ఉంటె..నాకు ప్రజలు ఉన్నారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. నేడు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పరిధిలోని విజయరాయిలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..పాదయాత్రలో ప్రజలకు జగన్ ముద్దులు పెడుతున్నారని… గెలిచిన తర్వాత పిడిగుద్దులు ఉంటాయని తాను అప్పుడే చెప్పానని… తాను చెప్పిందే ఇప్పుడు జరుగుతోందని .. రాష్ట్ర ప్రజలంతా జరుగుతున్నది చూస్తున్నారని చంద్రబాబు అన్నారు. ప్రజలు ఇప్పుడైనా తన మాట వింటారని… ఇప్పుడు కూడా వినకపోతే రాష్ట్రానికి ఇదే చివరి అవకాశం అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని, ముఖ్యమంత్రిగా పని చేశానని… ఇప్పుడు తనకు ఎమ్మెల్యే పదవితో పని లేదని చెప్పారు. ప్రజలు ధైర్యంగా ముందుకు రావాలని… భయపడితే అది మనల్ని చంపేస్తుందని అన్నారు.

టీడీపీ హయాంలోనే పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని చంద్రబాబు అన్నారు. ఇప్పుడున్న జలవనరుల శాఖ మంత్రికి డయాఫ్రం వాల్‌ అంటే ఏంటో కూడా తెలీదని.. ఆకాశంలో ఉంటుందని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తన బాధంతా రాష్ట్రం కోసమేనన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను ఆయన కుమార్తె వైఎస్‌ సునీత తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయించడం జగన్ కు చెంపదెబ్బ లాంటిదని చంద్రబాబు అన్నారు. వైఎస్‌ వివేకాను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే విషయాలు వెలుగులోకి రావాలన్నారు. ఈ అంశంపై సీఎం జగన్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.