కృష్ణా నదిపై వంతెన నిర్మించండి అంటూ నారా లోకేష్ కు విన‌తి..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర గురువారం కర్నూల్ జిల్లాకు చేరుకుంది. ఈ సందర్బంగా నారా లోకేష్ రాయలసీమ కర్తవ్య దీక్ష కరపత్రాలను ఆవిష్కరించారు. అప్పర్ భద్ర ప్రాజెక్ట్ నిలుపుదల చేయాలని, కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జ్ బదులు రోడ్ కమ్ బ్యారెజ్ నిర్మిస్తే రాయలసీమ రైతులకు న్యాయం జరుగుతుందని రాయలసీమ ఉద్యమనాయకులు లోకేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ విఎస్ సీమకృష్ణ, రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు నాగభూషణ్, రాము, సుధాకర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇక అనంతపురంలో పాదయాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా అభిమానులకు లోకేష్ లేఖ రాశారు. ‘‘జిల్లాలో ప్ర‌జ‌ల బాధ‌లు విన్నాను.. స‌మ‌స్య‌లు చూశాను.. ప‌రిష్కార బాధ్య‌త నేనే తీసుకుంటాను’’… పాదయాత్రను ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ లోకేష్ బహిరంగ లేఖ రారు.

యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా అనంతలోకి పాదయాత్ర ప్రవేశించిన సమయంలో ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలు తనపై అభిమానాన్ని కురిపిస్తూ ఘన స్వాగతం పలికారన్నారు. ప్ర‌జాభిమాన‌మే బ‌ల‌మై, జ‌న‌మే ద‌ళ‌మై, టీడీపీ నేత‌లే సార‌ధులై, కార్య‌క‌ర్త‌లే వార‌ధులై పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేశారని తెలిపారు. అనంత‌పురం జిల్లా ప్రేమ‌ని వ‌రంగా అందించిన ప్ర‌జ‌లు, టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, మీడియా మిత్రులు, వ‌లంటీర్లు అంద‌రికీ హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

యువగళం పాదయాత్ర నేటి నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగనుంది. రాయలసీమ లోని చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు యువగళం యాత్రను నారా లోకేష్ కొనసాగించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 874.1 కిలోమీటర్ల దూరం నడిచారు.