బఠిండాలో మళ్లీ కలవరం..బుల్లెట్‌ గాయంతో మరో జవాను మృతి

Barh Another soldier dies of gunshot wound at Bathinda Military Station: Army

చండీగఢ్‌ః బుధవారం తెల్లవారుజామున పంజాబ్‌ లోని బఠిండా సైనిక స్థావరం లో కాల్పుల కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. కాగా, తాజాగా బుల్లెట్‌ గాయాలతో మరో జవాను ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారులు గురువారం వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున కాల్పులు జరిగిన కొద్ది గంటల్లోనే చోటు చేసుకున్న మరో ఘటనలో జవాను ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అయితే, తాజా ఘటనకు అంతకుముందు జరిగిన కాల్పులతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అయితే జవాను ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఏదైనా ప్రమాదం జరిగిందా..? అన్నదానిపై స్పష్టత లేదు. ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో మరణించినట్లు ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు.

‘బఠిండా సైనిక స్థావరంలో బుధవారం సాయత్రం 4:30 గంటల ప్రాంతంలో ఒక సైనికుడు తుపాకీ గాయంతో మరణించాడు. అతను ప్రత్యేక యూనిట్‌కు చెందినవాడు. తన సర్వీస్‌ వెపన్‌తో సెంట్రీ డ్యూటీలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన అనంతరం మిలిటరీ ఆసుపత్రికి తరలించాం. కానీ తీవ్రమైన గాయాల కారణంగా జవాను మరణించాడు. అంతకు ముందు జరిగిన కాల్పుల ఘటనకు ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదు. అయితే అతడిది ఆత్మహత్యా..? లేక ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో మరణించాడా అన్నది తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. కేసు దర్యాప్తు చేస్తున్నాం’ అని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా, తాజా ఘటనతో 24 గంటల వ్యవధిలోనే బఠిండా సైనిక స్థావరంలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు.