కూలిన ఐదంతస్తుల భవనం..ఇద్దరి మృతి

2 dead, 13 rescued as under-construction building collapses in Kolkata

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గార్డెన్ రీచ్‌లోని హజారీ మొల్లా బగాన్ ప్రాంతంలో గత రాత్రి జరిగిందీ ఘటన. ఐదంతస్తుల భవనం అర్ధరాత్రి పెద్దశబ్దంతో ఒక్కసారిగా కుప్పకూలడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ వ్యక్తిగతంతా పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఇప్పటికే కొందరిని రక్షించామని ఆయన తెలిపారు. భవనం కూలడానికి ముందు కాంక్రీట్ పెచ్చులు ఊడిపడ్డాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. పెద్ద శబ్దంతో భవనం కూలిన తర్వాత ఆ ప్రాంతమంతా దుమ్ము,ధూళితో నిండిపోయింది.

భవనంలో ఎవరూ నివసించకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే ప్రతిపక్ష నేత సువేందు అధికారి స్పందిస్తూ వీలైనంత వేగంగా సహాయక చర్యలు అందించాలని కోరుతూ ఘటనా స్థలంలోని దృశ్యాలను ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు, బాధితుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు.